కవిత పారిపోతది .. అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్లే కుట్ర : ఎంపీ అర్వింద్‌

కవిత పారిపోతది ..  అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్లే కుట్ర : ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు శిక్ష పడడం ఖాయమని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అనారోగ్య సమస్యను సాకుగా చూపించి, విదేశాలకు పారిపోయేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.  కవిత దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందన్నారు. శనివారం ఆయన నిజామాబాద్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణలో జాప్యం సరికాదని, ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని కోరారు. అయోధ్యలో రాముడు తాను పుట్టిన చోటుకు తిరిగి వస్తున్న ఘడియ దేశ ప్రజలందరికీ పెద్ద పండుగతో సమానమన్నారు. 

ప్రధాని మోదీ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఇక నుంచి దేశంలోని ముస్లింలు కూడా రామ రాజ్యం కోసం పని చేయాలని సూచించారు. రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లే మహాభాగ్యం కల్పించిన తన లోక్‌‌‌‌సభ సెగ్మెంట్‌‌‌‌ ప్రజలకు పాదాభివందనాలు చెబుతున్నానన్నారు. ఏండ్లుగా కొనసాగుతున్న అయోధ్య సమస్యకు బీజేపీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని గుర్తుచేశారు. కాగా, అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టొద్దని అర్వింద్ సూచించారు. బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో ‘వికసిత్ భారత్ ప్రొగ్రాం’లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీకి చెందిన సుదర్శన్ గ్రామ సమస్యలు చెప్పి ఎంపీ ఫండ్స్ ఇవ్వాలని కోరారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వంలో ఆ పనులన్నీ ఎందుకు చేయించుకోలేదని, ఎంపీ నిధుల కోసం ఇప్పటిదాకా తన వద్దకు ఎందుకు రాలేదని ఎంపీ ఎదురు ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో ఈ గ్రామానికి నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.