హిందూ సమాజంలో ఉండి బీజేపీకి మద్దతు తెలపని వాళ్లు దేశద్రోహులన్నారు ఎంపీ అర్వింద్. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడారు. దేశ ప్రధాని మోదీ పనితనంతో అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. రాజ్యాంగంలో సెక్యూలరిజం పోవాలంటే మోదీ మరొకసారి ప్రధాని కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో హిందూ సమాజం ఒక్కటవ్వాలన్నారు. భారీ మెజారిటీతో మోడీని గెలిపించాలన్నారు.
లెక్కలు లేకుండానే కేసీఆర్ వేల కోట్లు తిన్నారన్నారు అర్వింద్. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు ఇప్పటికే మూడుసార్లు కమిటీ వేసినా.. కాంగ్రెస్ మళ్లీ కమిటీ వేసి ఏం చేస్తారని ప్రశ్నించారు. చక్కెర ఫ్యాక్టరీని తెరిచేందుకు కేంద్రాన్ని సహాయం కోరితే తప్పకుండా సహకరిస్తామన్నారు.
దేశానికి ప్రథమ శత్రువు కాంగ్రెస్
దేశానికి ప్రథమ శత్రువు కాంగ్రెస్ అన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ముస్లిం మైనారిటీ,క్రిస్టియన్స్ బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే మరో పాకిస్తాన్ గా మారుతుందన్నారు. కాంగ్రెస్ ది మోసపూరిత ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కొడంగల్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.