కరీంనగర్: మొదటి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తుంటే.. ఊహించిన దానికంటే అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవబోతుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. హుస్నాబాద్కు చెందిన పలువురు మాజీ సర్పంచులు బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..బీజేపీ 370 సీట్లకు పైగా గెలవడం ఖాయమన్నారు.ఈ విషయం తెలిసిన కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయన్నారు. తెలంగాణలో ఆ పార్టీలకు చాలా చోట్ల డిపాజిట్లు కూడా రావన్నారు.
కాంగ్రెస్ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్.. బీఆర్ ఎస్ నుంచి 25 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. వీళ్ల మాటలను చూసి జనం అసహ్యించుకుంటున్నారనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని బండి సంజయ అన్నారు. దమ్ముంటే ఫిరాయింపులే ఎజెండాతో ఎన్నికల్లో వస్తారా అని ప్రశ్నించారు.
ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) కప్ మోదీదే అన్నారు బండి సంజయ్. కరీంనగర్ లో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ కార్యకర్తల్లారా జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి దేశ రక్షణ కోసం పాటుపడుతున్న మోదీకి మద్దతుఇవ్వాలని కోరారు.
మంత్రి పొన్న ప్రభాకర్ ఆరోపణలపై స్పందించారు బండి సంజయ్.. 500 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్నందువల్లే శరత్ చంద్రారెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చిందని పొన్నం ఆరోపిస్తున్నారు.. దీనిపై కోర్టు ధిక్కరణ కింద ఫిర్యాదు చేస్తామన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ. 14 వేల బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను దారి మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు డ్రామాలాడుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.