- ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హుజూరాబాద్, వెలుగు: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెప్పే వాళ్ల మాటలు నమ్మొద్దని, అలా ప్రచారం చేసేవారిని చెప్పులు, చీపుర్లతో ఉరికించి కొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సంజయ్మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఫోన్ ట్యాపింగ్ పైసలతో కరీంనగర్‌లో ఓట్లను కొనాలనుకుంటున్నారన్నారు. పొరపాటున ఆ పైసలు తీసుకుంటే... మీకు నోటీసులు వచ్చే ప్రమాదముందని ప్రజలను హెచ్చరించారు. 300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఎట్లా సాధ్యమని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్నారు.
కాంగ్రెస్‌కు తనను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక బి.సంజయ్ పేరుతో ఓ వ్యక్తిని పోటీలో నిలిపిందన్నారు. ‘సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నడు. బండి సంజయ్ ఏం చేసిండని అంటున్నడు.. ఆయనకు తెల్వదేమో. రాష్ట్రానికి కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చింది. అని అన్నారు.
‘రేవంత్‌రెడ్డి జమ్మికుంటకు వచ్చి ప్రధానిని తిట్టినవ్. నన్ను కూడా గుండు అని తిట్టినవ్... గాడిద గుడ్డు అన్నవ్. నామీద, గాడిద గుడ్డు మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలుపై ఎందుకు లేదు.. వాటిని ఎందుకు అమలు చేయలేదు? ఇవి మాట్లాడకుండా తిట్టడమే పనిగా పెట్టుకుంటే జనం నమ్ముతారా’ అని ప్రశ్నించారు.