ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
  • అడ్వొకేట్ దంపతుల మర్డర్​పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ధ్వజం
  • సర్కార్ ​పెద్దలు, టీఆర్ఎస్ గూండాలు, పోలీసులు కలిసి చేశారు
  • కేసీఆర్​కు మంథని టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఇది
  • హత్యపై సీఎం వెంటనే స్పందించాలె 
  • సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలె
  • లాయర్ల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు అడ్వొకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల దారుణ హత్య వెనుక ప్రభుత్వంలోని పెద్దలు, మంథని టీఆర్ఎస్ గూండాలు, కొందరు పోలీసు అధికారుల పాత్ర ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నారనే కారణంతోనే వామన్ రావు దంపతులను మర్డర్ చేశారని సంజయ్ చెప్పారు. అడ్వొకేట్ దంపతుల హత్యపై స్పందిస్తూ సంజయ్ బుధవారం హైదరాబాద్ సిటీ బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. వామన్ రావుకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. ‘‘ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే… ప్లాన్ ప్రకారం చేసిన హత్య. సీఎం బర్త్ డే సందర్భంగా కేసీఆర్​కు మంథనికి చెందిన ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు అడ్వొకేట్ దంపతుల మర్డర్​ను గిఫ్ట్​గా ఇచ్చారు.. దాన్ని కేసీఆర్ స్వీకరిస్తారా.. లేక తిరస్కరించి అడ్వొకేట్లకు భరోసా కల్పిస్తారా అనేది చెప్పాలి” అని సంజయ్ డిమాండ్ చేశారు.

కోర్డుల్లో కేసులు వేస్తున్నారనే హత్య

వామన్ రావు దంపతుల హత్యపై కేసీఆర్ వెంటనే స్పందించాలన్నారు. ఈ హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించేందుకు రాష్ట్ర సర్కార్ ఒప్పుకొని తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని, ఒక హైకోర్టు మహిళా అడ్వకేట్ ను హత్య చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లకే రాష్ట్రంలో రక్షణ లేకుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను, ఎదిరించే వ్యక్తులను ఇలాగే హత్య చేస్తామని ప్రభుత్వం ఓ హెచ్చరిక చేసినట్లు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అవినీతి, అక్రమాల చిట్టా వామన్ రావు వద్ద ఉందని, వాటిని మాయం చేయడం సర్కార్​కు సాధ్యం కాకపోవడంతో, చివరికి మనిషినే ఇలా మాయం చేశారని
సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికే వామన్ రావు ప్రభుత్వ పెద్దల, టీఆర్ఎస్ నాయకుల, పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా, ప్రజా ధనం దుర్వినియోగం చేయడంపై కోర్టుల్లో కేసులు వేసి పోరాడుతున్నారని అన్నారు. లాకప్ డెత్ కేసులో పోలీసులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని సంజయ్ గుర్తు చేశారు.

ఈ దారుణంపై ఆందోళనలు చేపట్టాలి

ఇంత పెద్ద కేసును చిన్న కేసుగా సర్కార్ చిత్రీకరించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే అడ్వకేట్లందరు ఈ కేసును ఆషామాషీగా తీసుకోవద్దని, గురువారం నుంచి దీనిపై ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. వారు చేపట్టే ఆందోళనకు బీజేపీ లీగల్ సెల్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అడ్వొకేట్లకు రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సంజయ్ డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే అడ్వొకేట్లకు, ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు ఈ రాష్ట్రంలో రక్షణ కరువైందని మండిపడ్డారు. వామన్ రావు దంపతులు నిజాయితీ పరులని, నిక్కచ్చిగా పని చేసేవారని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని న్యాయవాదులు న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

For More News..

సాఫ్ట్​వేర్ కంపెనీలు మార్చిలో రీ ఓపెన్