
టేక్మాల్, జహీరాబాద్, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారు " అనేది నిజంకాదని జహీరాబాద్బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గురువారం మెదక్ జిల్లా టేక్మాల్, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కుటుంబ పాలనను కొనసాగిస్తూ స్వార్థ రాజకీయాల కోసం అట్టడుగువర్గాలకు రిజర్వేషన్లను అందకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు.
బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, దేశంలో అసమానతలు తొలగిపోవాలంటే రిజర్వేషన్ల అవసరం ఉందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగమే పవిత్ర గ్రంథం అని పీఎం మోదీ అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తుచేశారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన మాదిగలు రిజర్వేషన్ల ప్రయోజనం పొందేలా ఎస్సీ వర్గీకరణకు ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు.
పూర్తి మెజార్టీ ఉన్నా పదేళ్లలో ఏనాడూ మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. పైగా ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టిన ఘనత మోదీకే దక్కిందన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, మాజీ మంత్రి ఆంజనేయులు, పార్లమెంట్ కన్వీనర్ రవి గౌడ్, ఆందోల్ అసెంబ్లీ సమన్వయ కర్త జగదీశ్వర్, శివశంకర్, సిద్దేశ్వర్
పాల్గొన్నారు.