
మెదక్ : ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో చూస్తే బీఆర్ఎస్ ఈజ్ టైటానిక్ షిప్ లాంటిదని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సెటైర్ వేశారు. ఇవాళ మెదక్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం ప్రెస్ మీటలో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి భయపడి రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. కొట్లాడి టికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇచ్చిన టికెట్లను కూడా కాదనుకొని కారు దిగి వెళ్లిపోతున్నారంటేనే ఆ పార్టీ ఓటమి ఖాయమన్నారు.
మామను మించి అబద్దాలు చెప్పడంలో హరీశ్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో మొదట జెలుకు వెళ్లాల్సింది హరీశ్ రావేనని ఆయన చెప్పారు. తాను ఎవరి జోలికి వెళ్లనని.. తన జోలికి వస్తే ఊరుకోబోనని ఆయన హెచ్చరించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తనను,తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని అన్నారు. రఘునందన్ కొడితే బీఆర్ఎస్ మొత్తం మునిగిపోయిందన్నారు. తొందరగా టైటానిక్ షిప్ లో నుంచి కేసీఆర్ కుటుంబం బయటకు రావాలని సూచించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోకి వెళ్లి ఓట్లు అడుగుతామన్నారు. 17 ఎంపీ స్థానాలు గెలిచి మోడీకి కానుకగా ఇస్తామన్నారు. గల్లీలో ఏది ఉన్నా ఢిల్లీలో మోడీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మెదక్ ఎన్నిక ఏకపక్షంగా జరుగనుందని చెప్పారు.