కేసీఆర్ ఫాంహౌస్ డ్రామా అట్టర్ ప్లాఫ్ : బీజేపీ ఎంపీ అర్వింద్

నల్గొండ జిల్లా: కేసీఆర్ ఆడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఈ డ్రామాతో సీఎం కేసీఆర్ మీడియా దృష్టిని మళ్లించారేమో గానీ ప్రజల దృష్టిని మళ్లించలేకపోయారని అర్వింద్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతానికి సంబంధించి వరుసగా వీడియోలు, ఆడియోలు రిలీజ్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు డ్రామాను రక్తి కట్టిస్తున్నారని ఆరోపించారు. మునుగోడు బీజేపీ క్యాంప్ కార్యాలయంలో అర్వింద్ మాట్లాడారు. మొన్న వీడియో, ఇవాళ ఆడియోను రిలీజ్ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ వీడియో.. ఆడియో వల్ల తమకు ఏమాత్రం నష్టం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులపై ఉన్న చార్జ్ షీట్ ను  జడ్జి తిరస్కరించారని.. దీన్ని బట్టే ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందన్నారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

రాజీనామా చేసిన వాళ్లనే బీజేపీలోకి రానిస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొని బై పోల్ కు వెళ్తామని అర్వింద్ ప్రకటించారు.  మహిళ అనే సెంటిమెంట్ మునుగోడులో ఏమాత్రం పని చేయదని, సమస్యలు మాట్లాడేవారికే మునుగోడు ప్రజలు ఆదరిస్తారని తేల్చి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం తథ్యం అని ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.