కేటీఆర్.. కోర్టులకు పోయి తప్పించుకోవద్దు..నిర్దోషివైతే విచారణ ఎదుర్కో : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కేటీఆర్.. కోర్టులకు పోయి తప్పించుకోవద్దు..నిర్దోషివైతే విచారణ ఎదుర్కో : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ ను తప్పించే ప్రయత్నం చేస్తోంది: ఏలేటి మహేశ్వర్​రెడ్డి
  • ఫార్ములా కేసులో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం: ఎంపీ అర్వింద్

న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్​ కోర్టులకు వెళ్లి తప్పించుకోవాలని చూస్తున్నారని.. ఆయన నిర్దోషి అయితే విచారణ ఎదుర్కొని నిరూపించుకోవాలని బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంత్రిగా ఉన్న కాలంలో కేటీఆర్ అధికారులను భయపెట్టి పనులు చేయించుకున్నారన్నారని, ఇప్పుడు మళ్లీ వారినే బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని ఎంపీ అర్వింద్ అధికారిక నివాసంలో ఆయనతో కలిసి ఏలేటి మహేశ్వర్ రెడ్డిమీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు.

అందుకే  కేసీఆర్, కేటీఆర్ లు వేలు, లక్షల కోట్ల స్కాములు చేశారని ఆరోపించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు చిన్న పిటీ కేసులతో వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని, చేసిన పాపం ఊరికే పోదన్నారు. ప్రస్తుతం ఆయన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని, చర్లపల్లి జైలా లేక తీహార్ జైలా ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలకు పాల్పడారని మండిపడ్డారు. అడ్వకేట్లను తీసుకొస్తా అని కేటీఆర్.. నా ఇంట్లో విచారణ చేయాలని కవిత ఎంక్వైరీ అధికారుల మందు డిమాండ్లు పెడుతున్నారని అది కరెక్ట్ కాదన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ ఆఫీస్ పై దాడులను కాంగ్రెస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ హోం శాఖను తన వద్ద పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.