పాపాల భైరవుడు కేసీఆర్ను ఇంటికి పంపాలె

నల్గొండ: దేశంలోనే అందరి కంటే పెద్ద అబద్ధాలకోరు సీఎం కేసీఆర్ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివారం మునుగోడు సమరభేరీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మంచి చేస్తాడని భావించి ప్రజలు అధికారం ఇస్తే... రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. దేశంలో మిగతా సీఎంల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న కేసీఆర్... ప్రజల గురించి పని చేయడం మానేసి ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి న్యూక్లియర్ బాంబ్లా కేసీఆర్ తయారయ్యారని అభివర్ణించారు.

తన పాలనలో భూముల రేట్లు బాగా పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించామని చెబుతున్న కేసీఆర్... భూనిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు. శివలింగంపై తేలులా, గర్భగుడిలో గబ్బిలంలా కేసీఆర్ మారారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రోడ్డు రోలర్లా తొక్కాలని పిలుపునిచ్చారు. మునుగోడు మొనగాడు రాజగోపాల్ రెడ్డి అనిపేర్కొన్న అర్వింద్... ఉప ఎన్నికలో పాపాల భైరవుడు కేసీఆర్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.