- మా ప్రభుత్వమే వస్తదన్న పరిస్థితి ఉండే.. కానీ 8 సీట్లే ఎందుకొచ్చినయ్?: అర్వింద్
- తమ పార్టీలోనే సమస్యలు ఉన్నాయని కామెంట్
నిజామాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘ఓట్లు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే పరిస్థితి ఉండే. కానీ ఆ తర్వాత పరిస్థితి ఎందుకు మారింది? ఇందుకు జిమ్మేదారి ఎవరు?’’ అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లాలోని ఆర్వోబీల పనులపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ, ఇతర ఆఫీసర్లతో అర్వింద్ సమీక్ష జరిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత పార్టీలోని ఏ లీడర్ పేరు ఎత్తకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సైలెంట్‌గా ఎందుకు ఉంటున్నారు? అని చాలామంది అడుగుతున్నరు. నేను రిటైల్‌గా ఆలోచించడం మానేశా.. హోల్‌సేల్‌గా థింక్ చేస్తున్న. బీజేపీ అధికారంలోకి రావాలె? ఎట్ల రావాలె.. వచ్చినంక ఎవర్ని చెప్పు కింద తొక్కి పెట్టాలె అనేది మాకు తెలుసు. అయితే అధికారంలోకి ఎందుకొస్తలేదు? అనేదే నా ప్రశ్న. ఇది బీజేపీ పార్టీనే సాల్వ్చేసుకోవాలె. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం వస్తదనే పరిస్థితి ఉండే. కానీ మాకు మొత్తం 8 సీట్లే ఎందుకొచ్చినయ్? ప్రజలు మా పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం పడడం లేదు” అని తెలిపారు.
ఆర్వోబీల ఫండ్స్ దారి మళ్లించిన్రు..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జిల్లాల్లో లొట్టపీసు ఫలితాలు వచ్చాయని, ఆ పార్టీ గెలిచిన 36 స్థానాల్లో 25 హైదరాబాద్ చుట్టే ఉన్నాయని అర్వింద్ అన్నారు. ‘‘కేసీఆర్ లెక్కనే మోసగిస్తే కాంగ్రెస్‌ను సైతం జనం గాయబ్ చేస్తరు. ప్రభుత్వం ఖమ్మం, నల్గొండ జిల్లాలపై చూపుతున్న ప్రేమను నిజామాబాద్‌పై చూపిస్తలె” అని మండిపడ్డారు.
‘‘కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతోనే జిల్లాలో ఆర్వోబీ పనులు ఆలస్యమవుతున్నాయని మహేశ్ కుమార్ గౌడ్ నాపై నిందలు వేస్తున్నరు. నేను ఏడు ఆర్వోబీలు మంజూరు చేయిస్తే, అందులో ఒకటి పూర్తయింది. నాలుగు చోట్ల పనులు నడుస్తున్నయ్. ఒకటి పురోగతిలో ఉండగా, ఇంకొకటి మాత్రమే మొదలు కావాల్సి ఉంది. ఆర్వోబీ ఫండ్స్మొత్తం కేంద్రం ఎప్పుడో విడుదల చేసింది. వాటిని రాష్ట్ర సర్కార్ డైవర్ట్ చేయడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయి” అని చెప్పారు.