- 9 కొత్త మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర వాటా నయా పైసా లేదు
- కేంద్రం రూ.233 కోట్లు ఖర్చుచేసింది: ధర్మపురి అర్వింద్
- ఎన్నికల కోసం ఆదరాబాదరా ప్రారంభించారని విమర్శ
- కాలేజీల్లో సౌలత్లు లేవని, నిర్మాణాలే కాలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో బుధవారం సీఎం కేసీఆర్ వర్చ్యువల్ గా ప్రారంభించిన కొత్త మెడికల్ కాలేజీల్లో రాష్ట్రం వాటా నయా పైసా లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేంద్రం నిధులే రూ.233 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏయే జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు, ఆస్పత్రులకు కేంద్రం ఎన్ని ఫండ్స్ ఖర్చు చేసిందనే వివరాలను ఆయన వెల్లడించారు. కేంద్ర సర్కార్ రూ.5,200 కోట్ల రూపాయలను గ్రాంట్ కింద రాష్ట్రానికి ఇచ్చిందని, అందులో నుంచే రూ.233 కోట్లను ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల కోసం కేసీఆర్ ఖర్చు చేశారని ఆరోపించారు. పైగా కేంద్రం నుంచి నయా పైసా రాష్ట్రానికి రావడం లేదని కేసీఆర్ విమర్శలు చేయడంపై మండిపడ్డారు.
ALSO READ: పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు
కేంద్రం నిధుల తో మెడికల్ కాలేజీలను ప్రారంభించిన కేసీఆర్.. ఇదేదో రాష్ట్రం గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రారంభించిన ఈ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు లేవు. అసలు నిర్మాణాలే పూర్తి కాలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆదరాబాదరాగా ఈ ప్రారంభోత్సవాలు చేసినట్లు ఉందని ఆరోపించారు. ఇప్పటికే సర్కార్ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక పేషెంట్స్ ను ఎలుకలు కొరుకుతున్న ఘటనలను ఆయన గుర్తు చేశారు. ఇప్పడు ప్రారంభించిన మెడికల్ కాలేజీల్లో ఉన్న బోధన సిబ్బంది వివరాలపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.