కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌ది.. గల్లీలో కుస్తీ, చెన్నైలో దోస్తీ : ఎంపీ అర్వింద్‌‌‌‌

కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌ది.. గల్లీలో కుస్తీ, చెన్నైలో దోస్తీ : ఎంపీ అర్వింద్‌‌‌‌
  • డీలిమిటేషన్‌‌‌‌తో తెలంగాణకునష్టం లేదు: ఎంపీ అర్వింద్‌‌‌‌
  • రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలను బీసీల నుంచి తొలగిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌ది తెలంగాణ గల్లీల్లో కుస్తీ.. చెన్నైలో దోస్తీ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరిందా.. అందుకే డీఎంకే నేతృత్వంలో తమిళనాడులో జరిగిన మీటింగ్‌‌‌‌కు కేటీఆర్ హాజరయ్యారా అని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కులగుణన పేరుతో రాష్ట్రంలోని 80 శాతం ముస్లింలను సీఎం రేవంత్ రెడ్డి బీసీల్లో చేర్చారని ఫైర్ అయ్యారు. 

తాము అధికారంలోకి వచ్చాక ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు అనుమతివ్వదన్నారు. చెన్నైలో జరిగిన మీటింగ్‌‌‌‌లో సీఎం స్టాలిన్‌‌‌‌ ఏం మాట్లాడుతున్నారో వినే ఆసక్తి సీఎం రేవంత్‌‌‌‌కు లేదని, కేవలం ఇండియా కూటమిలో భాగస్వామి కాబట్టే.. స్టాలిన్‌‌‌‌ దుర్మార్గుడైనా ఆ మీటింగ్‌‌‌‌కు హాజరయ్యారని విమర్శించారు. 

బీఆర్ఎస్.. ఇండియా కూటమిలో చేరినట్లే..

చెన్నై మీటింగ్‌‌‌‌కు కేటీఆర్‌‌‌‌ వెళ్లడం అంటే.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ఇండియా కూటమిలో పరోక్షంగా చేరినట్లే కదా అని అర్వింద్‌‌‌‌ అన్నారు. ఎమ్మెల్సీ కవిత మిర్చి దండలు వేసుకుని తిరుగుతుంటే.. మరోవైపు, కేటీఆర్‌‌‌‌ కాంగ్రెసోళ్లతో దోస్తీలు చేస్తున్నాడని విమర్శించారు. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే డీలిమిటేషన్‌‌‌‌ పేరుతో విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేది అబద్ధమన్నారు. డీలిమిటేషన్‌‌‌‌తో తమిళనాడుకే సమస్య అని, తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు నష్టమేమి లేదని ఆయన చెప్పారు.