కేసీఆర్ అవినీతి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఆరోపించారు. ఈ కుంభకోణాల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాలని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో వీఆర్ఏలు ధర్న చేస్తున్నా.. ఆత్మహత్యాలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికే బీజేపీ సంగ్రామ యాత్ర చేపట్టామని తెలిపారు. కేసీఆర్ మూడో ఫ్రంట్ అని.. ప్రాంతీయ పార్టీలతో కలిసి తిరుగుతున్నడు.. కాంగ్రెస్ కు తోక పార్టీగా టీఆర్ఎస్ మారిందన్నారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక పార్టీలతో, అవినీతి పార్టీలతో చేతులు కలుపుతున్నాడని ఫైర్ అయ్యారు.