హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ పరిధి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాయిప్రియ ఎంక్లేవ్ లో ఇండ్ల కూల్చివేతపై అధికారులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పర్మిషన్లు ఉన్నా కూల్చిన కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు తెలివి లేదన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిప్రియ ఎంక్లేవ్ లో ఉన్న వారికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉందని, అలాంటిది అన్ని పర్మిషన్లు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా వారి ఇండ్లను కూల్చివేసిందని విమర్శించారు.
ప్రభుత్వాలు మారవచ్చని, కానీ అధికారలు మారరు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లాగే రేవంత్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని, జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నా కూడా ఇండ్లు కూల్చడమేంటని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని, డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రికి కాల్ చేస్తే తమకు తెలియదని చెబుతున్నారన్నారు.