
- రాహుల్ గాంధీకి అవగాహన, జ్ఞానం లేదు: ఈటల రాజేందర్
- కొన్ని కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్లో ఉన్నయి
- తామూ కాషాయ బుక్ రూపొందిస్తామన్న బీజేపీ ఎంపీ
వరంగల్, వెలుగు: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు చాన్సే లేదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన వరంగల్, నల్గొండ, ఖమ్మం బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ లో ఆయన ప్రెస్‍మీట్‍లో మాట్లాడారు. చాలా కులాలు దేశవ్యాప్తంగా ఒకే రిజర్వేషన్ కింద లేవన్నారు. రాష్ట్రంలో ఎస్టీల్లో ఉన్న లంబాడాలు మహారాష్ట్రలో బీసీగా, కర్ణాటకలో ఎస్సీగా ఉన్నారన్నారు. దేశవ్యాప్త కులగుణన చేస్తే ఇలాంటి కులాలను ఎందులో చేర్చాలో కాంగ్రెస్ చెప్పగలదా.. వారికి ఆ జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు.
రజక తెలంగాణలో బీసీ అయితే కర్ణాటకలో ఎస్సీగా.. ఇక్కడ రెడ్డి ఓసీగా, కర్ణాటకలో బీసీగా.. మత్స్యకారులు రాష్ట్రంలో బీసీగా, యూపీలో ఎస్సీగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో కులగణనకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, కులగణన పేరుతో కాంగ్రెస్ చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనకు చట్టబద్ధత ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి కులగణనకు వెళ్తున్నారంటే అది వారి వైఫల్యమేనన్నారు. గత బీఆర్‍ఎస్ హయాంలో కేసీఆర్ తీరువల్లే గ్రీన్‍ఫీల్డ్, నేషనల్ హైవేల్లో భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం జరిగిందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో రైతుల భూములకు మార్కెట్ ధర ప్రకారం అటుఇటుగా పరిహారం ఇస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ రేటు ఇచ్చిందన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో రైతులు న్యాయమైన పరిహారం పొందుతుంటే ఇక్కడ రైతులకు మార్కెట్ రేటులో 10 నుంచి 20 శాతం నష్టపరిహారం కూడా దక్కని పరిస్థితి ఉందన్నారు. కలెక్టర్లతో పూర్తిస్థాయి సర్వే చేయించి రైతులకు సరైన నష్టపరిహారం అందేలా రైతుల పక్షాన పోరాడుతున్నట్టు చెప్పారు.
రైతులకు సరైన పరిహారం అందించేవరకు గ్రీన్‍ఫీల్డ్, నేషనల్ హైవే పనులకు సంబంధించి ముందుకు వెళ్లొ దన్నారు. ఇదే విషయాన్ని తాను పార్లమెంట్‍లోనూ ప్రస్తావించినట్లు తెలిపారు. ఇతర పార్టీలు రెడీ చేస్తున్న రెడ్ బుక్, పింక్ బుక్ మాదిరిగానే తామూ కాషాయ బుక్ రూపొందిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ ఎంపీ సీతారాం నాయక్, పార్టీ వరంగల్, హనుమకొండ అధ్యక్షులు గంట రవి, కొలను సంతోష్ రెడ్డి ఉన్నారు.