- పేదలపై దౌర్జన్యం చేసే గూండాల భరతం పడతం: బీజేపీ ఎంపీ ఈటల
- ఏకశిలానగర్ బాధితులకు అండగా ఉంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ‘పేదల భూములు లాక్కోవాలని ఎవరైనా చూస్తే నా కొడకల్లారా చీల్చి చెండాడుతాం.. పేదలపై దౌర్జన్యం చేసే గూండాలు, భూ అక్రమార్కుల భరతం పడుతాం..’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ‘మహిళలను, సామాన్య పేదలను ఇబ్బంది పెట్టే హక్కు మీకెక్కడిదిరా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతోనే భూఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూ ఆక్రమణలపై లోకాయుక్త, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఈటల మీడియాతో మాట్లాడారు. పేదలకు జాగలు ఇచ్చి, ఇండ్లు కట్టించింది బీజేపీయేనని చెప్పారు. నగరంలో గూండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావం ఉందన్నారు. రియల్టర్ల పేరిట భూముల ఆక్రమణతో దౌర్జన్యం చేస్తున్నారని, దీనిపై రాచకొండ సీపీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం చూపలేదన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో బాధితులకు తాము అండగా నిలిచామని వెల్లడించారు. పేద ప్రజలు బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టి ఇండ్లు కట్టలేదన్నారు. లోన్లు తెచ్చి స్థలాలు కొనుక్కుంటే కబ్జా చేస్తారా? అని ప్రశ్నించారు.
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని 149 ఎకరాల్లో ఉన్న ఏకశిలానగర్ లో మంగళవారం జరిగిన సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. 1985లో ఆ భూములను వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కొనుగోలు చేశారని, ఇది 2005 వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఓనర్లే 47.25 ఎకరాల భూమిని ఎంఏ రాజు, ఏ వెంకటేశ్, ఏ విజయభాస్కర్ పేరిట సేల్ డీడ్ చేశారని ఎంపీ వివరించారు.
2006లో ఈ ముగ్గురు భూమిని కొన్నట్లుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని, పంచాయతీ రాజ్ డీపీవోను మేనేజ్ చేసి అవి ప్లాట్లు కాదని అగ్రికల్చర్ ల్యాండ్ గా నమోదు చేయించారని పేర్కొన్నారు. ఏకశిలానగర్ బాధితులకు అండగా ఉంటామన్నారు. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని, తెలంగాణ ఉద్యమంలో 150 కేసులు ఉన్నాయని ఈటల పేర్కొన్నారు.