జనసేనతో ఓకే .. టీడీపీతో పొత్తు అధిష్టానిదే నిర్ణయం

ఏపీలో పొత్తు రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి.  బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు.  అందుకోసం చర్చలు జరుగుతున్నాయని ఇండికేషన్స్ కూడా  ఇచ్చారు. 

జనసేనతో మాత్రమే బీజేపీ పొత్తు

ఏపీలో పొత్తులకు సంబంధించి కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేత జీవీఎల్ అన్నారు. ప్రస్తుతానికి  జనసేనతో తమ పార్టీ పొత్తు ఉంటుందని  జీవీఎల్ అన్నారు. టీడీపీ కూడా కలిసి వస్తోందనే ప్రతిపాదన పవన్  తీసుకొచ్చారని వివరించారు. పొత్తుల గురించి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోబోదని స్పష్టంచేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదించే వరకు టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉండదన్నారు.

ప్రజల మధ్యే పొత్తుల ఒప్పందం: పవన్

అయితే పవన్ మాత్రం ప్రజల మధ్య పొత్తులపై ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని తేల్చిచెప్పారు. త్రిముఖ పోటీ ఉండకూడదని.. అలా అయితే మరోసారి బలి అవుతామని వివరించారు. ఇప్పుడు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యం అని.. విజయం సాధించిన తర్వాత సీఎం ఎవరు కావాలనే అంశం గురించి చూద్దాం అని చెప్పారు.