రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌తో కుస్తీనే!

రాష్ట్ర సర్కారు అలసత్వం వల్లే నత్తనడకన అభివృద్ధి

కేంద్రం తన వాటా ఇచ్చినా.. రాష్ట్ర వాటా ఫండ్స్ ఇస్తలే

న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్​తో బీజేపీకి ఏనాడూ పొత్తు లేదని, ప్రజా సమస్యలపై కుస్తీ మాత్రమే ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు గతంలో పొత్తు పెట్టుకున్నాయని, అధికారం పంచుకున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీశ్​రావు పని చేశారని గుర్తు చేశారు. ఉంటే ఆ రెండు పార్టీల మధ్యే స్నేహం ఉంటుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించి, బీజేపీని అధికారంలోకి తేవడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. గురువారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్లు, మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణ పనులు రాష్ట్ర సర్కార్ అలసత్వం వల్లే నత్తనడకన సాగుతున్నాయని, పలు ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని కిషన్​రెడ్డి ఆరోపించారు. కేంద్రం తన వంతు వాటా నిధులు ఇస్తున్నా.. టీఆర్ఎస్ సర్కార్ తన షేర్ ను రిలీజ్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంఎంటీఎస్ విస్తరణకు సంబంధించి కేంద్రం మంజూరు చేసిన దాని కంటే ఎక్కువగానే ఫండ్స్ రిలీజ్ చేసిందని చెప్పారు. మెట్రో దారి మళ్లింపు పేరుతో కేసీఆర్ ఆరు నెలలు పనులు ప్రారంభం కాకుండా ఆపారన్నారు.

తబ్లిగీల వల్ల వైరస్ వ్యాప్తి..  రాష్ట్ర సర్కార్ నివేదిక ఇచ్చింది

తబ్లిగీ జమాత్ (మర్కజ్) మత ప్రార్థనల్లో పాల్గొన్న విదేశీయులకు బెయిల్ ఇచ్చే అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు. వీసా రూల్స్ ఉల్లంఘించారని కేసులు పెట్టామే తప్ప, దేశానికి రావడం తప్పని ఎక్కడ పేర్కొనలేదన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనల వల్ల వైరస్ వ్యాప్తి చేశారన్న అంశంపైనే వారిపై కేసులు పెట్టినట్లు చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాల్లోని మసీదుల్లో వీరు నిర్వహించిన మత ప్రార్థన వల్ల కరోనా వ్యాప్తి చెందిందని ఆ రోజు నివేదికలు స్పష్టం చేశాయన్నారు. తబ్లిగీల వల్లే మసీదుల చుట్టుపక్కల్లో వైరస్ వ్యాప్తి జరిగిందని తెలంగాణ సర్కార్ పంపిన నివేదికలు తమ వద్ద ఉన్నాయన్నారు. కరీంనగర్, జగిత్యాల వంటి ఏరియాల్లో వైరస్ వ్యాప్తి జరిగిందని కేంద్ర హోం శాఖకు రాష్ట్ర సర్కారునివేదికలు పంపిందన్నారు.

ఎయిమ్స్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను అప్పగించలేదు

రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన ఎయిమ్స్ ను హెల్త్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ నిర్మించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఆ బిల్డింగ్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు. దీంతో ఆ భవనాన్ని ఇంత వరకు నిమ్స్ కు ఇవ్వలేదని, నిమ్స్.. ఎయిమ్స్ కు అప్పగించలేదన్నారు. కానీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ తో పాటు ఔట్ పేషెంట్ విభాగాలు రన్ అవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్, మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

For More News..

ప్రతి నెలా వెయ్యెకరాల్లో టమాట వెయ్యాలె

సంక్రాంతి తర్వాత స్కూళ్లు, కాలేజీలు ఓపెన్!

పరిహారం తేల్చకుండా పనులు కానివ్వం