హెచ్​సీయూ భూములను అమ్మొద్దు .. భవిష్యత్ తరాలకు గ్రీన్ స్పేస్ అందదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హెచ్​సీయూ భూములను అమ్మొద్దు .. భవిష్యత్ తరాలకు గ్రీన్ స్పేస్ అందదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తమకూ తెలుసని..కానీ హెచ్​సీయూ భూములను మాత్రం అమ్మవద్దని ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.  శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా హెచ్ సీయూ భూముల వివాదం కొనసాగుతుందన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకున్న హక్కులతో హెచ్ సీయూ భూములను అమ్ముతామని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. విద్యార్థులకు, ప్రకృతికి నష్టం చేసి భూమిని ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. 30 ఏండ్ల నుంచి గ్రీన్, రాక్ స్పేస్ ఉందని.. 

అమ్మకం నిర్ణయంతో భవిష్యత్ తరాలకు గ్రీన్ స్పేస్ అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ కూడా ఇలానే భూములు అమ్మారని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అమ్ముతున్నారని విమర్శించారు. గతంలో భూములమ్మిన బీఆర్ఎస్.. ఇప్పుడు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. హెచ్ సీయూ భూముల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. 

కాంక్రీట్ జంగిల్ గా మార్చే ప్లాన్: ఎంపీ ఈటల

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణకు తలమానికమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.  అలాంటి వర్సిటీని కాంక్రీట్ జంగిల్​గా మార్చాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఆయన బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్ సీయూ భూములను అమ్మి అప్పులు కట్టాలని చూస్తోందన్నారు. 15 నెలలుగా రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం తిరోగమనం వైపే సాగిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల వేలాన్ని విరమించుకోవాలని,లేకుంటే దేనికైనా తాము వెనుకాడబోమని ఈటల హెచ్చరించారు.