కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌, హీరో, విలన్‌.. అంతా వాళ్లే!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ హైదరాబాద్లో నడిచిన హైడ్రామాపై  బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు  ప్రయత్నించిందన్న ఆరోపణలను తిప్పికొట్టారు.  కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌, హీరో, విలన్‌.. అంతా టీఆర్ఎస్ వాళ్లేనని కామెంట్ చేశారు.  కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అయినట్టు.. టీఆర్ఎస్ ఆడిన ఈ డ్రామా ఫెయిల్ అయిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకుడి ఫామ్‌హౌస్‌, డబ్బులు, యంత్రాంగం, పోలీసులు అంతా వాళ్ల మనుషులేనని ఆయన చెప్పారు.

కేవలం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే  ఆ పార్టీ వాళ్లు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.  ప్రచారానికి మిగిలిన ఈ నాలుగైదు రోజుల్లో ఇంకా ఎన్ని కథలు సృష్టిస్తారో చూడాలన్నారు. ‘‘గతంలో కూడా మంచి స్టోరీ చూశాం. ఓ మంత్రిని హత్య చేసేందుకు రూ.కోట్లు సుపారీ ఇచ్చారని  కథ అల్లారు. ఆ కథ కంచికేనా? దానికి కారకులైన వారు టీఆర్ఎస్ ప్లీనరీలో సెల్ఫీ దిగిన ఉదంతాలను చూశాం’’ అని ఎంపీ లక్ష్మణ్ గుర్తుచేశారు. ‘‘ మునుగోడులో ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయేది లేదు. ఎందుకింత ఆక్రోశం. ఇలాంటి కట్టు కథల ద్వారా ప్రజల దృష్టిని మరల్చలేరు’’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.