యాదాద్రి భువనగిరి : మునుగోడు ఉప ఎన్నికలతో రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కుటుంబం కోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నట్లు అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ అండదండలతో తప్పించుకునే అవినీతిపరులకు ఎవరూ మద్దతు ఇవ్వకూడదని చెప్పారు. అవినీతి, కుటుంబ పార్టీలు రాజ్యాంగబద్ద సంస్థళకు రాజకీయాలను ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వండర్ కాదు.. బ్లండర్ అని లక్ష్మణ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరైందని, దాన్ని ఆదాయం తెచ్చే ప్రాజెక్టులా అధికారపార్టీ మార్చుకుందని ఆరోపించారు. కేసీఆర్ చేసిన పాపాలు భరించలేక గోదావరి తల్లి కాళేశ్వరాన్ని ముంచి అవినీతిని బహిర్గతం చేసిందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల దుర్వినియోగం చేసిన హరీశ్ రావుకు కాళేశ్వర్ రావు అని పేరు పెట్టాలని చురకలంటించారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనన్న లక్ష్మణ్ ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి పోయినా స్పందించని కాంగ్రెస్ నైజాన్ని గ్రహించే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.