
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అప్పులు రూ.8 లక్షల కోట్లు అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. అప్పుల్లో ఉన్నాం కాబట్టి భూములు అమ్ముతున్నామని చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలతో హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నదన్నారు.
మంగళవారం రాజ్యసభలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ బిల్లు2024 పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘1979లో అప్పటి ప్రభుత్వం హెచ్‌సీయూకు 2300ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 400 ఎకరాలను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వరదల గురించి ఆయన ప్రస్తావించారు.
తాను కూడా పడవల్లో ప్రయాణం చేసి ప్రజల వద్దకు వెళ్లానని గుర్తు చేశారు. వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆక్రమణలు తగ్గలేదని, మురుగు వ్యవస్థ సరిచేయలేకపోయారన్నారు. ప్రధానంగా విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు.