తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలి : ఎంపీ లక్ష్మణ్

తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలి :  ఎంపీ లక్ష్మణ్
  • రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఐఐఎం)ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించాలని కోరారు. గురువారం రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ అనుమతితో తెలంగాణలో ఐఐఎం అంశాన్ని లేవనెత్తారు. దేశంలో 21 ఐఐఎంలు ఏర్పాటు చేశారని, కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఐఐఎం లేదన్నారు. ఐఐఎంను హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజలుగత కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్ సిటీ కేవలం నార్త్, సౌత్ రాష్ట్రాలను కలిపే ప్రాంతం మాత్రమే కాదని, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు, మతాలు, భాషలతో కూడిన సిటీ అని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో హైదరాబాద్‌‌‌‌కు రోడ్డు, విమాన, రైల్వే మార్గాల్లో కనెక్టివిటీ ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎడ్యుకేషనల్, ఇండస్ట్రియల్, ఫార్మాస్యూటికల్, బయోటెక్, సైంటిఫిక్, ఇన్ఫర్మేటివ్ రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. వాతావరణం, భద్రతపరంగా హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ అని వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఈ బడ్జెట్‌‌‌‌ సమావేశాల్లోనే హైదరాబాద్‌‌‌‌లో ఐఐఎంకు నిధులు కేటాయించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన వెల్లడించారు.