బీఆర్ఎస్​ను ప్రజలు బొందపెట్టారు : ఎంపీ లక్ష్మణ్

బీఆర్ఎస్​ను ప్రజలు బొందపెట్టారు : ఎంపీ లక్ష్మణ్
  • ఇక ఆ పార్టీకి మిగిలింది కాంగ్రెస్​లో విలీనమే: లక్ష్మణ్
  • తప్పులను చూపి బీఆర్ఎస్​ను కాంగ్రెస్ లొంగదీసుకోవాలని చూస్తోందని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రాజకీయంగా బొంద పెట్టారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆ పార్టీ ఉనికి కోల్పోయిందని..ఇక మిగిలింది కాంగ్రెస్ లో విలీనం తప్ప మరేమీ లేదన్నారు. బీఆర్ఎస్ చచ్చిన పాము అని, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కామెంట్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మసకబారిందని విమర్శించారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్,- బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.

కమ్యూనిస్ట్​లు ఎంఐఎంతో పరోక్షంగా కలిసి కాంగ్రెస్ పోటీ చేసినా  చావు తప్పి కన్ను లొట్టపడ్డట్లు సీట్లు గెలుచుకున్నదని ఎద్దేవా చేశారు. కానీ, సింగిల్ గా ఫైట్ చేసిన బీజేపీ.. 8 సీట్లు గెలుచుకోవడం ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణలో తొలిసారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం, ఇతర తప్పులను చూపి కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి బేరసారాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసుల్లో కేవలం పాత్రదారులను అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, సూత్రధారులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఒక్కొక్క ఎమ్మెల్యేను కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారని.. మొత్తం పార్టీని విలీనం చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం వాటా కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని రాస్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 

అందుకే బెయిల్ రావట్లే....

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితది కీలక పాత్రని, అందుకే నెలలు గడుస్తున్నా ఆమెకు న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వడం లేదని లక్ష్మణ్ తెలిపారు. కవిత అరెస్ట్ పై కాంగ్రెస్ ద్వంద వైఖరి అవలంబించిందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి 293 స్థానాలు గెలిచినా.. కాంగ్రెస్ దివాలకోరు రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. దాదాపు 100 సీట్లకు చేరుకుని కాంగ్రెస్ ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మారకపోతే జనరల్ వార్డ్ నుంచి మార్చురీకి పోతుందని మండిపడ్డారు. శుక్రవారం ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశం జరగనుందని, సాయంత్రం రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉందన్నారు.

తానెప్పుడూ పదవులు కావాలని అడగలేదని, ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.ఉద్యమ సమయంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని... బలిదేవత అని విమర్శించారు. ఒకప్పుడు సోనియాను రేవంత్ కూడా  విమర్శించారని.. ఇప్పుడు ఆ బలిదేవతకు సీఎం ఎలా భక్తుడు అయ్యాడో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు.