
- దక్షిణాదిపై కేంద్రం కుట్ర చేస్తుందనడం సీఎంకు తగదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఆరోపించారు. దక్షిణాదిపై కేంద్రం కుట్ర పన్నుతుందనడం సరికాదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదని చెప్పారు. డీలిమిటేషన్ పై రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పడం కాంగ్రెస్ పార్టీ దురుద్దేశాన్ని తెలియజేస్తుందన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకు నష్టమని సీఎం మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
దేశాన్ని దక్షిణాది, ఉత్తరాది అని విభజించాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదని, దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగేలా తెలంగాణ, తమిళనాడు సీఎంలు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసేది ప్రభుత్వం కమిటీనా లేక కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న కమిటీనా సీఎం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.