తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు అక్టోబర్ 21వ తేదీన విడుదల కానున్నాయని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. 50 మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ 50 స్థానాల్లో దాదాపు 20పైగా స్థానాలను బీసీలకు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు ఎంపీ లక్ష్మణ్. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని చెప్పారు. ఏ క్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేశామని చెప్పారు. మహిళలకు సీట్ల విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని..ఢిల్లీలో కవిత ధర్నలు చేసింది కానీ..మహిళలకు సీట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
Also Read :- అమలుకాని సీఎం కేసీఆర్ హామీలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను పట్టించుకోవడం లేదని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీసీల సేవలను వాడుకున్న కాంగ్రెస్..ఆ తర్వాత వారిని వదిలేసిందన్నారు. బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ బీజేపీ అని..బీసీల కోసం బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.
సస్పెండ్ అయినా రాజాసింగ్ అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. అటు బీజేపీ ప్రచారంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు పాల్గొంటారని స్పష్టం చేశారు.