మజ్లిస్‌‌కు తలొగ్గే విమోచన వేడుకలకు సీఎం రావట్లే:బీజేపీ ఎంపీ లక్ష్మణ్

  • రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి: లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: మజ్లిస్‌‌ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్‌‌ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు సీఎం రాకపోవడం విచారకరమన్నారు. గతంలోనూ కేసీఆర్ ఇదే విధంగా వ్యవహరించారని, అప్పుడు ఆయనకు పట్టిన గతే రేవంత్‌‌కు కూడా పడుతుందన్నారు. 

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల17న జరగనున్న విమోచన వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో రిహార్సల్స్‌‌తో పాటు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను శనివారం లక్ష్మణ్ పరిశీలించారు. 

గతంలో రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదని, అయినప్పటికీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా గత మూడేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. 

తెలంగాణ విమోచన దినం చరిత్ర, అమరవీరుల పోరాటగాథలను కళ్లకు కట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్‌‌ ప్రభుత్వం.. మజ్లిస్‌‌ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడాన్ని ప్రజలు క్షమించరన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బైరాన్‌‌పల్లి నుంచి మొదలు పరకాల వంటి పోరాట కేంద్రాలనూ స్ఫూర్తి కేంద్రాలుగా, మ్యూజియాలుగా తీర్చిదిద్దే బాధ్యత సర్కారుపై ఉందన్నారు. 

కొంతమంది లౌకిక వాదులు విలీనమని, విద్రోహమంటూ అనేక వక్రీకరణలతో ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. లక్ష్మణ్‌‌ వెంట మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.