విజయ సంకల్ప యాత్ర రథచక్రాల కింద కాంగ్రెస్, బీఆర్ఎస్​ నలిగిపోతయ్​: లక్ష్మణ్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలు డైవర్షన్​ పాలిటిక్స్​కు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​ పొత్తు పెట్టుకుంటాయంటూ తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని ఫైర్​ అయ్యారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి కాంగ్రెస్, బీఆర్ఎస్​ మధ్యే చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. విజయ సంకల్ప యాత్ర రథచక్రాల కింద ఆ రెండు పార్టీలు నలిగిపోవడం ఖాయమన్నారు. 

శుక్రవారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో లక్ష్మణ్  మాట్లాడారు. అవినీతి బీఆర్ఎస్​ను కాపాడేందుకు కాంగ్రెస్​ ఎందుకు కాపలా కాస్తున్నదని ప్రశ్నించారు. కాళేశ్వరం, ధరణి, ఇసుక దందా వంటి వాటితో రూ.లక్షల కోట్లు కాజేసిన బీఆర్ఎస్​ నేతలపై చర్యలు తీసుకోకుండా కూనిరాగాలు తీస్తున్నారని మండిపడ్డారు. లోపల చీకటి ఒప్పందాలు చేసుకుని బయట విమర్శలు చేసుకుంటున్నారని ఫైర్​ అయ్యారు. విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుందన్నారు. బీఆర్ఎస్​ అవినీతి, కాంగ్రెస్​ గ్యారంటీల అమల్లో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. 

మోదీ నాయకత్వంపై నమ్మకం

మోదీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని లక్ష్మణ్​ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన పార్టీలకు ప్రజలు ఓటేసినా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీనే గెలిపిస్తారన్నారు. అయోధ్యలో రామ మందిరం కట్టిస్తే.. కాంగ్రెస్​ నాయకులు ఆ పూజల్లో పాల్గొనలేదని ఫైర్ అయ్యారు. దేశానికి మోదీ పాలన స్వర్ణయుగమని,  పదేండ్ల ఆయన పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. ముస్లింలను సంతృప్తిపరచి హిందువులను దూషించడమే కాంగ్రెస్​ గ్యారంటీ అని విమర్శించారు.