హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం అయినట్లేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని, ఒక్క ఓటమితో కుంగిపోయే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు. ఓటమిని పాఠంగా స్వీకరించి రానున్న రోజుల్లో పార్టీ పటిష్టత కోసం మరింత కృషి చేస్తామని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదని, కాంగ్రస్ పతనానికి ఇది అద్దం పడుతోందని చెప్పారు. దేశంలో ఇవాళ వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రస్ తన రెండు స్థానాలను కోల్పోయిందని తెలిపారు. కానీ బీజేపీ తన మూడు సీట్లతో పాటు మరో సీటులో గెలుపొందిందని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అనైతికంగా విజయం సాధించిందని మండిపడ్డారు. ఊరికొక ఎమ్మెల్యేను దింపి కేసీఆర్ డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సహకారంతో టీఆర్ఎస్ గెలిచిందని, నైతికంగా బీజేపీదే విజయం అని స్పష్టం చేశారు. గత ఎన్నికలో మునుగోడులో 12 వేల ఓట్లు సాధించిన బీజీపీ... తాజాగా 86 వేలకు పైగా ఓట్లు సాధించిందని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యమ్యాయం బీజేపీయేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా దేశంలో కాంగ్రెస్ పుంజుకోవడం అసంభవమని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.