
- కేంద్రం బీసీ రిజర్వేషన్లు పెంచి.. చట్టబద్ధత కల్పించాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు : దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దేశంలో బీసీల జనాభా 60 శాతం ఉం టుందని.. అయితే అధికారికంగా ఆ లెక్కలను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో చేపట్టినట్టు దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు న్యాయస్థానాల నుంచి అడ్డంకులు ఎదురవకుండా చట్టబద్ధత కల్పించాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.
బుధవారం హైదరాబాద్ కాచిగూడలో ఓబీసీ మహిళ సంక్షేమ సంఘం కన్వీనర్ మట్టా జయంతి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన సమావేశంలో చలో ఢిల్లీ పోస్టర్ను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. మహిళలకు కేటాయించిన 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 18,19న చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బీసీ మహిళ ఆధ్వర్యంలో ఢిల్లీలో సెమినార్ నిర్వహించ నున్నట్లు తెలిపారు. చట్ట సభల్లో మహిళలకు కేటాయించిన 33 శాతంలో రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 50 శాతం సబ్ కోటా కల్పించాలన్నారు.