కులగణన అంతా తప్పుల తడక..బీసీ రిజర్వేషన్లను దెబ్బ తీయాలని చూస్తున్నరు: ఆర్ కృష్ణయ్య

కులగణన అంతా తప్పుల తడక..బీసీ రిజర్వేషన్లను దెబ్బ తీయాలని చూస్తున్నరు: ఆర్ కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో నడుస్తున్నది ప్రజా పాలన కాదని, బీసీలను ముంచే పాలన అని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన అంతా తప్పుల తడకగా ఉన్నదని చెప్పారు. కుల గుణన ద్వారా బీసీల జనాభాను తక్కువగా, ఓసీల జనాభాను ఎక్కువగా చూపించడం వెనుక కుట్ర దాగి ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. 

ఈడబ్ల్యూఎస్‌‌ రిజర్వేషన్లను కాపాడేందుకు, బీసీ రిజర్వేషన్లను నీరుగార్చే కుట్రలో భాగంగానే రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువచేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో ఎంపీ ఆర్‌‌.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా జనాభా పెరుగుతుందని, రేవంత్‌‌ సర్కారులో మాత్రం తగ్గిందని అన్నారు. ఇది అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్న వారి కుట్ర అని పేర్కొన్నారు. 

బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతంగా ఉంటే, ప్రస్తుతం కుల గణన ద్వారా బీసీల జనాభా 46 శాతమని చెబుతున్నారని అన్నారు. గతంలో 10 శాతం ఉన్న ఓసీల జనాభా 15 శాతానికి పెరిగినప్పుడు.. బీసీల జనాభా పెరగకుండా ఎలా ఉంటు-దని ప్రశ్నించారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడంపై సీఎం రేవంత్‌‌ స్పందించాలని, ఈ రిపోర్ట్ పై సమగ్ర సమీక్షకు ఆదేశించాలని డిమాండ్‌‌ చేశారు. పూర్తి పారదర్శకతతో గణంకాలను వెల్లడించాలని కోరారు.

 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కమిషన్‌‌ను ఏర్పాటు- చేయకుండానే కుల గణనను ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం లేదని, నామినేటెడ్‌‌ పదవుల భర్తీలోనూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీసీలకు న్యాయం జరగకుంటే ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.  ఈ విషయంలో ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా బీసీల తిరుగుబాటు- తప్పదన్నారు.