రాజకీయ బాంబులని చెప్పుడు కాదు చేసి చూపెట్టాలి :ఎంపీ రఘునందన్​రావు

రాజకీయ బాంబులని చెప్పుడు కాదు చేసి చూపెట్టాలి :ఎంపీ రఘునందన్​రావు
  • అవినీతిపరులను అరెస్ట్​ చేస్తే స్వాగతిస్తం: ఎంపీ రఘునందన్​ 
  •  ఇందిరమ్మ కమిటీలపై కోర్టుకు వెళ్తాం
  •  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు పెట్టాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ నేతలు రాజకీయ బాంబులు పేలుస్తామని చెప్పుడు కాదని, చేసి చూపించాలని బీజేపీ ఎంపీ రఘునందన్​రావు అన్నారు. ‘‘పేలబోయేవి కుక్కతోక పటాకులా.. సుతిల్ బాంబులా? అన్నది చూడాలి. బాంబులు పేల్చుతామని చెప్పుడు కాదు.. చేసి చూపించాలి. అవినీతిపరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తం” అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో రఘునందన్​రావు మాట్లాడారు.

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్​హౌస్​కు పరిమితమైతే.. ఆయన కొడుకు కేటీఆర్​ రేవ్​ పార్టీలని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ‘‘బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు. బీఆర్ఎస్ కు ప్రజలు ‘సీ’ స్థానం ఇచ్చారు. భవిష్యత్ లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు” అని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం1,200 కోట్లు విడుదల చేసిందన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్​రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పంచాయతీ కార్యదర్శులు సొంతగా డీజిల్, శానిటేషన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

గ్రామ సభలు పెట్టాల్సిందే

గ్రామ సభలు పెట్టకుండా కాంగ్రెస్ నాయ కులు చెప్పిన వారినే ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేస్తున్నారని రఘునందన్​రావు మండిపడ్డారు. ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ వాళ్లకు ఎందుకు భాగస్వామ్యం కల్పించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీ వాళ్లతోనే ఆ కమిటీలను నింపారని దుయ్యబట్టారు. ‘‘ఇందిరమ్మ కమిటీలపై న్యాయస్థానానికి వెళ్తాం. ఈ కమిటీలు చెల్లుబాటు కావు.

గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి తప్పితే.. ఇందిరమ్మ కమిటీల ద్వారా కాదు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇండ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నది” అని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.మాజీ సీఎం కేసీఅర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.