యాదాద్రి : గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకోకపోతే... మన పిల్లల రక్తాన్ని కూడా తాగుతాడంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోులను కేసీఆర్ మోసం చేశాడని, రైతులను నట్టేట ముంచాడంటూ మండిపడ్డారు. డబుల్ బెడ్ ఇండ్లు ఇస్తానని చెప్పి నిరుపేదలను కూడా మోసం చేశాడని ఆరోపించారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో ఎంపీ సోయం బాపురావు కూడా పాల్గొన్నారు. రామన్నపేట సుభాష్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.
సర్వే ఫలితాల్లో బీజేపీదే అధికారం
రాబోయే ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని ఎంపీ సోయం బాపురావు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఇండ్ల విషయంలోనూ ఇప్పటి వరకూ ఎన్ని నిర్మించారో కేసీఆర్ ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వరద బాధితులను కూడా ఆదుకోలేదని, వారికి ఎలాంటి సాయం చేయలేదన్నారు. తక్షణ సాయం కింద నిత్యావసర వస్తువులు ఇవ్వకుండా చేతులు దులుపుకొందని ఆరోపించారు. కేసీఆర్ నైజాం దొరలా వ్యవహరిస్తున్నాడని, ప్రజలందరూ ఆలోచించి.. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.