ముంబై: కాంగ్రెస్ కు ఓటేస్తే దేశ, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని భారతీయ యువ మోర్చా చీఫ్, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య మహారాష్ట్ర ఓటర్లను హెచ్చరించారు. కర్నాటక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటోందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ముంబైలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘‘పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ పై చట్టబద్ధమైన హెచ్చరిక ఉంటుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేశ, రాష్ట్ర ఆర్థికరంగం దెబ్బతింటుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటా కల్పించాలని కర్నాటక ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మతం ఆధారంగా రిజర్వేషన్లను భారత రాజ్యాంగం అనుమతించదు. మహారాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ కు ఓటేస్తే త్వరలోనే ఈ రాష్ట్రం కూడా కర్నాటక మాదిరిగా మారుతుంది” అని ఆయన హెచ్చరించారు.