- హైడ్రా, మూసీ ప్రక్షాళనపై చర్చ!
- బీజేపీ ఎంపీలతో కిషన్ రెడ్డి భేటీ
- హైడ్రా, మూసీ ప్రక్షాళనపై చర్చ!
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ గెస్ట్ హౌస్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. హైడ్రా, మూసీపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో తాము ఏ అంశాలను లేవనెత్తాలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై ఎంపీలు, నేతల అభిప్రాయాలను సేకరించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఫార్మా అభివృద్ధి కోసం తీసుకున్న భూములను ఫోర్త్ సిటీ కోసం వినియోగించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి. ఫోర్త్ సిటీ కోసమే అయితే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఇతర నేతలు హాజరయ్యారు. కాగా.. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జీగా వ్యవహరించి చెప్పుకోదగ్గ సీట్లు సాధించడంలో కృషి చేసినందుకు కిషన్ రెడ్డిని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సన్మానించారు.