
- రేవంత్ రెడ్డీ.. నీ ఆస్తులు అమ్ముకో.. ప్రజల ఆస్తులు కాదు: బీజేపీ
- 400 ఎకరాలతో 40 వేల కోట్లు సంపాదించాలని చూస్తుండు
- ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆందోళన
న్యూఢిల్లీ, వెలుగు: 400 ఎకరాల భూముల వేలం ఆపే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే సీఎం రేవంత్ తన సొంత ఆస్తులు అమ్ముకోవాలి తప్ప ప్రజల ఆస్తులు కాదన్నారు. హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ఆపేయాలంటూ బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. హెచ్‌సీయూ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాల భూముల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నిరసనను తెలిపారు. ఈ ఆందోళనలో ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, జి.నగేశ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, హరీశ్ బాబు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అమ్మకపోతే ఒక్క రోజు కూడా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదని చెప్పి యూనివర్సిటీ- భూములు అమ్ముతున్నారని విమర్శించారు. 400 ఎకరాలు అమ్మి 40 వేల కోట్లు సంపాదించాలనే పనికి రేవంత్ రెడ్డి పూనుకున్నాడని ఆరోపించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వందల బుల్డోజర్లతో చెట్లను కూల్చివేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు.
హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావంగా ఢిల్లీలో ఆందోళన చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలందరం ఇక్కడికి వచ్చినట్టు ఆ పార్టీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భూములు అమ్మితే ఖబర్దార్ అని హెచ్చరించారు. భూముల రక్షణకు విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇష్టానురీతిగా భూములు అమ్ముతానంటే చూస్తూ ఊరుకోం అని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక, ప్రభుత్వ భూముల అమ్ముతారా..? అని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోకాపేటలో ప్రభుత్వ భూములు అమ్ముతుంటే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారని విమర్శించారు.