- మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లేవి?
- బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆగ్రహం
మునుగోడు, వెలుగు: ఉద్యమ సమయంలో దళితులను సీఎం చేస్తానని మాట ఇచ్చి సీఎం కుర్చీ మీద కూర్చున్న దళిత ద్రోహి కేసీఆర్ అని బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మునుగోడులో ఏర్పాటుచేసిన దళిత మోర్చా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘దళితులను కేసీఆర్ ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నాడే తప్ప వారి సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదు. ఎనిమిదిన్నరేండ్ల కాలంలో దళితులకు మూడు ఎకరాల స్కీమ్ కింద పంచిన భూమి ఎంత? ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించిండు? ఆ వివరాలు దళితులకు చెప్పాలి” అని నిలదీశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తానని చెప్పి అక్కడక్కడ నామమాత్రంగానే అమలు చేశారని, ఈ విషయాన్ని దళితులు గమనించాలని ఆయన కోరారు. దళిత కార్పొరేషన్ నిధులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నాయకులు గడప గడపకు తిరిగి వివరించాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎలా ముందుకు పోవాలో వివేక్ వెంకటస్వామి దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, దళిత మోర్చా నాయకులు పాల్గొన్నారు.