హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి పడడంతో నష్ట పోయిన రైతులకు 48 గంటల్లో పరిహారం చెల్లించాలని, లేకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం నిడమనూరులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే ఎడమ కాల్వకు గండి పడి వేలాది ఎకరాలు నీటమునిగాయన్నారు. రైతులు భారీగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గండి పడి 13 రోజులు అవుతున్నా జిల్లా మంత్రి కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ రైతులతో మాట్లాడకపోవడం దుర్మార్గం అన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గండిని త్వరగా పూడ్చి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకురాలు కంకణాల నివేదితారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, చెనమొని రాములు పాల్గొన్నారు.
మునుగోడులో గెలిచేది టీఆర్‌ఎస్సే...
సంస్థాన్‌నారాయణపురం, వెలుగు : మునుగోడులో గెలిచేది టీఆర్‌ఎస్సేనని ఆలేరు, తుంగతుర్తి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో జరిగిన టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను చూసి జాతీయ పార్టీల లీడర్లకు చెమటలు పడుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొనే తెలంగాణ సాధించామన్నారు. మంగళవారం జరిగే టీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల వనభోజనాల కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతి, పీఏసీఎస్ చైర్మన్ జంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్ల శివశంకర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలు సాగు చేయాలి
సూర్యాపేట, వెలుగు : ఆయిల్‌పామ్ తోటలు వేసిన రైతులు మొదటి మూడేళ్లు అంతర్ పంటలను సాగు చేయాలని సూర్యాపేట హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీధర్ సూచించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం ముప్పారంలో సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను సోమవారం ఆయన పరిశీలించి ట్లాడారు. ఆయిల్ పామ్ చేతికి రావడానికి నాలుగేళ్లు పడుతుందని, అందువల్ల మొదటి మూడేళ్లు పత్తి, వేరుశనగ, మిర్చి, మినుములు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ జగన్, బీరెల్లి ప్రభాకర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బోళ్ల వెంకటరెడ్డి, కోట రాంరెడ్డి పాల్గొన్నారు.
మహిళలకు గుండు కొట్టించిన కేసులో 8 మందిపై కేసు
దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం రామునిగుండ్ల తండాలో ఇద్దరు మహిళలకు గుండు కొట్టించిన కేసులో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్‌రావు చెప్పారు. తండాలో ఓ ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్యకు ఇద్దరు మహిళలే కారణమంటూ గ్రామస్తులు శనివారం వారిపై దాడి చేసి ఇద్దరికీ గుండు కొట్టించారు. దీంతో బాధిత మహిళ సోమవారం కొండమల్లేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సర్పంచ్ భర్త శకృనాయక్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
యాదాద్రి, వెలుగు : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారంలో సోమవారం జరిగింది. రూరల్ ఎస్సై రాఘవేందర్‌గౌడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనగాం జిల్లా నర్మెట్ట మండలం పెద్దగుండు తండాకు చెందిన లకావత్ కొమరెల్లి (30) ఆదివారం రాత్రి బైక్‌పై హైదరాబాద్ నుంచి తండాకు వస్తున్నాడు. అనంతారం బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతడు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ కొమరెల్లి స్పాట్‌లోనే చనిపోయాడు.
కారు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి..
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మీనా ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఆదివారం రాత్రి ఓ కారు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. టూటౌన్ సీఐ నిగిడాల సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కాలేజీ సమీపంలో ఢీకొట్టడంతో సుమారు 25 ఏళ్ల వయసున్న వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడిని కోల్‌కతాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సీఐ తెలిపారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
దేవరకొండ, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు, క్రీడల్లోనూ రాణించాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల డివిజన్ స్థాయి క్రీడా పోటీలను సోమవారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బాయ్స్ హైస్కూల్‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకే ప్రభుత్వం గిరిజన ఆశ్రమ స్కూల్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్‌గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, ఏటీడీవో వెంకటయ్య, వడ్త్య దేవేందర్ పాల్గొన్నారు.
మునుగోడులో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తది
చౌటుప్పల్, వెలుగు : మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీమంత్రి, చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి గీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే దేశంలో ప్రాజెక్టులు, యూనివర్సిటీలు ఏర్పడ్డాయన్నారు. వాటన్నింటిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు అమ్మేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎంఐఎంను పక్కన పెట్టుకొని, తన కుటుంబం కోసమే పాలన చేస్తున్నారన్నారు. తెలంగాణలో దళితబంధు ఇవ్వాలని ఏ ఒక్కరూ కోరలేదని, హామీలు ఇచ్చి నెరవేర్చకుండా వారిని అవమానిస్తున్నారన్నారు. ప్రతి బూత్‌కు 25 మందితో కమిటీ వేసుకుని గడపగడపకు ప్రచారం చేయాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ ఏం చేసింది.. ఇప్పుడు ఏం చేయబోతోందని ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మునుగోడు క్యాండిడేట్ పాల్వాయి స్రవంతి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఆకులు ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
చండూరు(నాంపల్లి), వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ క్యాండిడేట్ పాల్వాయి స్రవంతి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నాంపల్లిలో సోమవారం పార్టీ ఆఫీస్‌ను ప్రారభించిన అనంతరం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో మాట్లాడారు. తన స్వార్థం కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారాడని విమర్శించారు. ఎన్నికల టైంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాలు, కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నాయన్నారు. ప్రజలను పట్టించుకోని వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌అంజన్‌కుమార్ యాదవ్, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, పన్నాల లింగయ్య, మంచుకొండ సంజయ్, కొమ్ము భిక్షం పాల్గొన్నారు.
‘ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు’
సూర్యాపేట, వెలుగు : ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణలో ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు విమర్శించారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన పలువురు సోమవారం సంకినేని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇండ్లు అంటూ దళితులు, గిరిజనులను, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను, ఫసల్‌బీమా యోజనను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నిధుతోనే గ్రామాల్లో అభివృద్ధిపనులు జరుగుతున్నాయన్నారు. ‘వచ్చే ఎన్నికలే నాకు చివరి పోటీ.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని సంకినేని ప్రజలను కోరారు.
చోరీలు చేస్తున్న నలుగురి అరెస్ట్
హుజూర్‌నగర్, వెలుగు : పలు ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం కోదాడ డీఎస్పీ జి.వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన నాగులూరి ఈశ్వరయ్య, ఏసోబు, ఆదినారాయణ, ఏసురత్నం జల్సాలకు అలవాటు పడి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పగటి పూట గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించేవారు. రాత్రుళ్లు ఆ ఇండ్లలో చోరీలు చేసేవారు. ఈ క్రమంలో సోమవారం లక్కవరం బైపాస్ రోడ్డులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇదే టైంలో బైక్‌పై వస్తున్న నాగులూరి ఈశ్వరయ్య, ఏసోబును ఆపి వివరాలు అడిగారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం బయటపడింది. ఇప్పటివరకు బూరుగడ్డ ఆలయం, నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం, చెన్నకేశవాపురంలో పలు చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి 4.07 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై రాజేంద్రనగర్, షాద్‌నగర్, కడప, రాజాంపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో 125కు పైగా కేసులు నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు. హుజూర్‌నగర్ సీఐ వై.రామలింగారెడ్డి, ఎస్సై కట్టా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
సూర్యాపేట, వెలుగు : వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి పద్మ సూచించారు. సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని వృద్ధులకు సోమవారం చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమానికి అన్ని రెవెన్యూ డివిజన్లలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం వృద్ధుల హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఎఫ్‌ఆర్‌వో వినోద్, జిల్లా కోఆర్డినేటర్ పి.సంపత్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్రు
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు సీఎం కేసీఆర్ బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ఆరోపించారు. భారత్ జోడో యాత్రకు మద్దతుగా సోమవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతోందని, దీంతో కేసీఆర్ నిద్ర కరువైందన్నారు. ఎంపీపీ చీర శ్రీశైలం, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ.యాకూబ్, సర్పంచ్ శ్రీరాములు, ఎంపీటీసీ సుగుణమ్మ రాంరెడ్డి పాల్గొన్నారు. అలాగే బాహుపేటకు చెందిన పలువురు బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
నారసింహుడిని దర్శించుకున్న నీతి ఆయోగ్ టీం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సోమవారం నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వైజర్ డాక్టర్ బిశ్వనాథ్ బిషోయ్‌తో పాటు టీం మెంబర్స్ దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపం వద్ద వేదాశీర్వచనం చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన ఉపేందర్ అన్నదానం కోసం రూ.1,01,116 విరాళంగా ఇచ్చారు.
స్టూడెంట్ డెడ్‌బాడీ వెలికితీత
భూదాన్‌పోచంపల్లి, వెలుగు : యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం పెద్దగూడెంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ నోముల ఆకాశ్‌రెడ్డి డెడ్‌బాడీని సోమవారం మధ్యాహ్నం బయటకు తీశారు. ఇంటర్ చదువుతున్న ఆకాశ్‌రెడ్డి మ్యాథ్స్ లెక్చరర్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆదివారం మధ్యాహ్నం బావిలో దూకాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో రెస్క్యూటీంకు చెప్పారు. దీంతో బావిలో నీటిని తోడి 24 గంటల తర్వాత డెడ్‌బాడీని బయటకు తీశారు. మృతుడి తల్లి అనిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు.