కేంద్ర బడ్జెట్ 2025-26 స్వాతంత్ర్య భారతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నింటిలో భిన్నమైనది. ఇది ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్. నిజాయితీకి, పారదర్శకతకు పెద్దపీట వేసిన బడ్జెట్. దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపించే బడ్జెట్. ఈ బడ్జెట్ను ప్రధానంగా ప్రజల కొనుగోలుశక్తిని పెంచే బడ్జెట్గా చెప్పవచ్చు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం కలవారికి ప్రత్యక్ష పన్ను (ఆదాయ పన్ను) మినహాయిపునివ్వడం దేశంలో ఎవరూ ఊహించలేదు. ఇది వినిమయాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది.
ప్రత్యక్ష పన్ను (ఇన్‌కమ్ టాక్స్) తగ్గించడం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పన్ను తగ్గింపు ద్వారా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరుగుతుంది. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుంది.
గతంలో ప్రభుత్వాలకు అవసరం ఉన్నప్పుడల్లా నోట్లను ముద్రించేవారు. నోట్లు ముద్రించగానే ద్రవ్యోల్బణం పెరిగి, అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి, సామాన్యుడికి భారంగా మారేది. కానీ మోదీ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికింది. ఎగుమతులు పెరిగి దిగుమతులపై ఆధారపడడం తగ్గింది. ఫలితంగా దేశంలో విదేశీ మారక నిల్వలు గణనీయ స్థాయిలో పెరిగాయి.
ఆదాయంలో 74 శాతం రాష్ట్రాలకే
మోదీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించి, రాష్ట్రాల ఆదాయం పెరిగే విధంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. 50 సంవత్సరాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణంగా రూ.1.54 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇస్తున్నారు. మొత్తం కేంద్రం ఆదాయంలో 74 శాతం అన్ని పథకాలకూ కలిపి రాష్ట్రాలకు అందుతున్నది. అంకెల రూపంలో దాదాపు రూ.36 లక్షల కోట్లు కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్నది. 2014లో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం.. నేడు నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఎక్కడా అవినీతికి చోటివ్వకుండా, పారదర్శకత పాటించడం వల్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో తలసరి ఆదాయం 250 శాతం పెరిగింది.
లాభసాటి వ్యవసాయం కోసం..
రైతులకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్రెడిట్ కార్డు పరిమితి పెంచారు. సుమారు 8 కోట్ల మంది వ్యవసాయ, మత్స్య, పాడి రైతులకు లాభం చేకూరుతుంది. వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన, నాణ్యమైన, అధిక దిగుబడులనిచ్చే విత్తనాలను ఉత్పత్తి చేసి, తద్వారా రైతుల దిగుబడి పెంచి, వ్యవసాయం లాభసాటిగా మార్చే ప్రణాళిక రూపొందించారు.
ప్రధానంగా పత్తి ఉత్పత్తి పెంచి, జిన్నింగ్, స్పిన్నింగ్, బట్ట నేయడం వంటివన్నీ ఆయా పత్తి పండే ప్రాంతాల్లోనే నెలకొల్పి, పత్తి పంటను లాభసాటిగా మార్చాలని నిర్ణయించారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు సంపూర్ణంగా మౌలిక సదుపాయాలు (గోడౌన్ లు, కోల్డ్ స్టోరేజీలు మొదలైనవి) అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో కేటాయించారు.
ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత
బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రంగానికి కూడా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రతిపాదించారు. రుణ అర్హతను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచారు. తద్వారా ముద్ర యోజనను బలోపేతం చేశారు.
విద్యకు ప్రాధాన్యం
అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 50,000 అటల్ విజ్ఞాన ప్రయోగశాలలను ప్రభుత్వ పాఠశాల్లో ప్రవేశపెడుతున్నారు. టెక్నికల్ రీసెర్చ్ కోసం నిధులు కేటాయించారు. 6 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రూ.500 కోట్లు కేటాయించి పాఠశాల స్థాయి నుంచే బోధిస్తున్నారు. 10వేల మెడికల్ సీట్లు పెంచుతున్నారు. 10వేల ఐఐటీ, ఐఐఎస్సీ పరిశోధకులకు నెలకు రూ.10,000 ఫెలోషిప్ ఇవ్వనున్నారు.
అన్ని రంగాలకు ఊతం
దేశంలో 100 శాతం ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. వృద్ధులకు రూ.50వేల నుంచి రూ.1 లక్ష వరకు పన్ను మినహాయింపులు ప్రకటించారు. రక్షణ రంగానికి సుమారు రూ.4,91,021 కోట్లు కేటాయించి దేశ భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. దేశవ్యాప్తంగా అత్యంత ఆధునిక ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయనున్నారు. గ్రామీణాభివృద్ధికి 2025-26 బడ్జెట్లో రూ. 2,66,817 కోట్లు కేటాయించారు.
సమీకృత అభివృద్ధికి బడ్జెట్
ఇది ఓటుబ్యాంకు బడ్జెట్గా కాకుండా దేశ సమీకృత అభివృద్ధికి దోహదపడే బడ్జెట్గా రూపకల్పన చేశారు. పేదలకు బ్యాంకు సేవలందించేందుకు 51 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిపించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సక్షన్ (డీబీటీ) కింద ఇప్పటికే రూ.30 లక్షల కోట్లు ప్రజల ఖాతాలోకి వెళ్లాయి. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందనడానికి ఇది నిదర్శనం.
దుర్వినియోగం కట్టడి
ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు 2013-–14లో 3.79 కోట్లు ఉంటే, నేడు 10 కోట్లకు పైగా పెరగడం దేశ ఆర్థికస్థితి పెరిగిందని చెప్పేందుకు నిఖార్సయిన ఉదాహరణ. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత పరోక్ష పన్నుల ద్వారా నెలకు సుమారు రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నది. 3.50 లక్షల బోగస్ కంపెనీల రద్దు, నోట్ల రద్దు, జీఎస్టీ, కార్మిక సంస్కరణలు, పునరుత్పాదక ఇంధనం, బినామీ ఆస్తుల చట్టం, రెరా, ఆధార్ లింక్, డీబీటీ, సబ్సిడీల దుర్వినియోగం అరికట్టడం మొదలైన సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది.
ఎన్పీఏలు లేవు
యూపీఏ కాలంలో వివిధ పారిశ్రామికవేత్తులకు, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలలో 82 శాతం ఎన్పీఏలు (నాన్ పర్మామింగ్అసెట్స్) గా బయటపడ్డాయి. వాటి విలువ రూ.52 లక్షల కోట్లు అని స్వయంగా ప్రధాని మోదీ పార్లమెంటులో తెలిపారు. కానీ, ఎన్డీఏ కాలంలో ఒక్క ఎన్పీఏ రాకుండా సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు.
రైతుకు ఊతం
నీటిపారుదల రంగానికి ప్రాధాన్యతనిచ్చారు. ఎఫ్పీఓలు, సహకార సంఘాలను బలోపేతం చేసి, రైతుల బేరమాడే శక్తిని పెంచి, పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేందుకు ఈ బడ్జెట్లో అవకాశం కల్పించారు. తమ పంటకు లాభసాటి ధర నిర్ణయించుకునే అవకాశం రైతుకు కలుగుతుంది. వివిధ రకాల పప్పుధాన్యాలు అధిక ఉత్పత్తి చేసి ఎగుమతులు పెంచేందుకు 6 ఏళ్ల ప్రణాళిక రూపొందించి, దానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు.
తద్వారా సామాన్య ప్రజలకు ప్రొటీన్ ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చారు. వ్యవసాయ రంగానికి 2014 ముందు బడ్జెట్లో రూ.30వేల కోట్ల నిధులు కేటాయిస్తే నేడు రూ.1,71,437 కోట్లు కేటాయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ను కొత్తపుంతలు తొక్కించేందుకు బీహార్లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థను నెలకొల్పుతున్నారు.
జీడీపీకి లోబడి అప్పులు
కేంద్ర ప్రభుత్వం అప్పులు సైతం జీడీపీ పరిమితిలోపే ఉన్నాయి. 2014 నాటికి దేశం అప్పులు జీడీపీలో 50.1 శాతం ఉంటే ప్రస్తుత 2024-–25లో జీడీపీ పరిమితికి లోబడి 45 శాతం అప్పులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతి వనరులు, మానవ వనరులు, ఉత్పత్తి రంగాలు(వ్యవసాయ, పరిశ్రమలు, సేవారంగం), ఉత్పత్తి రంగాల వాటా (విద్య, ఆరోగ్యం, భూమి, అడవులు, నీటి వనరులు మొదలైనవి). ప్రధాని మోదీ ఈ నాలుగు అంశాలను సమన్వయం చేస్తూ భారతదేశాన్ని ప్రగతిపథంపై పరుగులు పెట్టిస్తున్నారు.
నరహరి వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత