బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ చీఫ్ నడ్డా 

బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కమలం పార్టీ గ్రౌండ్ వర్క్ నెమ్మదిగా పెంచుతోంది. ఈనేపథ్యంలో డిసెంబరు 16న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో నడ్డా పాల్గొననున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు నడ్డా అపాయింట్మెంట్ కోరడంతో.. 16న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు రాష్ట్రంలోని జిల్లాల బీజేపీ నేతలతో బండి సంజయ్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా నేతలతో సమావేశం అవుతున్నారు. రేపు నిజామాబాద్, ఎల్లుండి ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల నేతలతో సంజయ్ భేటీ కానున్నారు. పాదయాత్ర శిబిరంలోనే.. ముఖ్యనేతలతో వరుసగా సమీక్షలు నిర్వహించి పార్టీ బలోపేతం, నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే  నిర్మల్, మంచిర్యాల జిల్లాల నేతలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ ముఖ్యనేతలకు చెప్పారు. పాదయాత్ర లేట్ అవుతుండటంతో అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా.. జనవరి నుంచి బండి సంజయ్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.