పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే నల్గొండ సస్యశ్యామలమయ్యేది 

  • నిధులు దుర్వినియోగం చేస్తూ కేంద్రంపై నిందలేస్తున్నరు
  • రాజగోపాల్ తో కలిసి అమిత్ షా సభ స్థల పరిశీలన 
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి : వివేక్ వెంకటస్వామి 

మునుగోడు, వెలుగు : సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ.. సీఎం కేసీఆర్​ కుటుంబం గుప్పిట్లో బందీ అయ్యిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు సభ ఇన్​చార్జి వివేక్​ వెంకటస్వామి అన్నారు. కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 21న మునుగోడులో నిర్వహించనున్న అమిత్​షా సభ స్థలాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డితో కలిసి వివేక్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు  ప్రజలు గుర్తుకొస్తారని, ఆ తర్వాత ప్రజలను మర్చిపోయి ఫామ్ హౌస్ లో పడుకుంటారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, కమీషన్లతో కల్వకుంట్ల కుటుంబం కోట్లు సంపాదించుకుందని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే నల్గొండ జిల్లా సస్యశ్యామలమయ్యేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడారని, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ అవినీతిపై యుద్ధం చేస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికలో కేసీఆర్ కు మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర సర్కార్ దుర్వినియోగం చేస్తోందని, పైగా కేంద్రం మీదే నిందలు వేస్తోందని మండిపడ్డారు. అవినీతికి తావు లేకుండా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మోడీ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని మునుగోడుకు వస్తవ్ : రాజగోపాల్ 
మూడున్నరేండ్లుగా అసెంబ్లీలో మునుగోడు సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని  మునుగోడులో సభకు వస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి చేయరా? అని అడిగారు. నల్గొండ, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ‘‘మునుగోడులో అమిత్​షా సభ కోసం 20 రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సభకు పోటీగా రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్ఎస్ సభ పెడుతోంది. మునుగోడు లో జరుగుతోంది  ధర్మ యుద్ధం. ఇవి కేసీఆర్​అహంకారానికి, మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ యుద్ధంలో మునుగోడు ప్రజలు ధర్మం వైపే నిలబడతారు” అని అన్నారు. తెలంగాణ ప్రజలు తమ ఆత్మ గౌరవం కోసం యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

‘‘కేసీఆర్ ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గాలకు నిధులు ఇస్తున్నారు. అందుకే నేను రాజీనామా చేశాను. నా రాజీనామాతోనే పింఛన్లు మంజూరు చేశారు. గట్టుప్పల్ మండలం అయింది’’ అని రాజగోపాల్ అన్నారు. ఎస్ఎల్ బీసీ, డిండి ఎత్తిపోతలు, చల్లగూడెం ప్రాజెక్టుల తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టును ముందుగా పూర్తి చేశారని..  మునుగోడు ప్రజలపై ప్రేమ ఉంటే ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాల్సిందన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా గోస పెడుతున్నారని మండిపడ్డారు. శివన్న గూడెం ప్రాజెక్టు నిర్వాసితులు మూడ్రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు 2014 తర్వాత ఎన్ని నిధులు ఇచ్చారు? మిగతా నియోజకవర్గాలకు ఎంత ఇచ్చారో? చెప్పాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.