పెద్దపల్లి జిల్లా: ప్రపంచ దేశాలు భారత్ గురించి గొప్పగా చెబుతున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం రామగుండం ఎన్టీపీసీలోని తన నివాసంపై వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రధాని మోడీ ‘హర్ ఘర్ తిరంగా’ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. దేశభక్తి, సమైక్యతా భావాలను దేశ ప్రజల్లో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రజలంతా కలిసి మెలిసి ఉంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరారు. రకరకాల మతాలు, కులాలు, ప్రాంతాలు భాషలు ఉన్నపటికీ తామంతా ఒక్కటేననే భావంతో దేశ ప్రజలు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. భారతీయత అంటే ఇదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కౌశిక హరి, మల్లికార్జున్, రాంబాబు, మధు, తదితరులు పాల్గొన్నారు.