బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ నాటకాలాడుతున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దేశవ్యాప్తంగా లిక్కర్ దందా చేయడం కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసిందేమిలేదని.. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 60వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే.. ఎనిమిదేళ్లలో కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు.
తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ సొంతమని వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70వేల కోట్లు, మిషన్ భగీరథలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతిలో నెంబర్ వన్.. సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. తెలంగాణ వ్యతిరేకులకు పెద్దపీట వేశారని మండిపడ్డారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితులను సైతం మోసం చేశారని విమర్శించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.