కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు

కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు

మునుగోడు: రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ ట్రెండ్ నడుస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడులో పర్యటిస్తున్న ఆయనతో వీ6 ఫేస్ టూ ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... మామూలు సమయాల్లో సీఎం కేసీఆర్ ప్రజలను ఏమాత్రం పట్టించుకోరని, ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన బయటకు వస్తారని విమర్శించారు. రాజీనామా తర్వాతే ప్రజలు గుర్తొస్తారా అంటూ  కేసీఆర్ ను ప్రశ్నించారు. కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే మునుగోడులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రోడ్లు, దళిత బంధు, పెన్షన్లు  వంటివన్నీ  రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతే వస్తున్నాయని తెలిపారు. ఏనాడు సర్పంచ్ లను పట్టించుకోని ఇక్కడి మంత్రి... ఇప్పుడు ఏకంగా వారితోనే చెక్కులు ఇప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.

 

కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరన్న వివేక్... ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఓ వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ప్రజలకు ఇండ్లు కట్టిస్తోంటే... రాష్ట్రంలో కేసీఆర్ మాత్రం అబద్ధాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. మోడీకి పేరొస్తందనే కుట్రతో ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ పతనం మొదలైందని,  కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో బీజేపీ గెలుపును అడ్డుకోలేరని పేర్కొన్నారు. మోడీ నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం, కార్యకర్తల అంకితభావంతో మునుగోడు ఎన్నికల్లో అవలీలగా విజయం సాధిస్తామని వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు.