- కేసీఆర్.. ఇదిగో నీ అఫిడవిట్
- నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ఎక్కువగా చూపింది
- నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటావా?
- నేనైతే సీఎం అవుతానని చెప్పను
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
కరీంనగర్: ‘ధరణి తప్పుల తడకని నువ్వే చెప్పుకున్నవ్ కదా కేసీఆర్.. ఇదిగో నీ అఫిడవిట్. నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ఎక్కువగా చూపింది. మరి ఇప్పుడేమంటావ్.. నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటావా? ధరణి పోర్టల్ రైతులను అరిగోస పెడుతుందని అంగీకరిస్తవా?’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఫైర్అయ్యారు. కరీంనగర్లో చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ‘ధరణి గురించి మాట్లాడితే కేసీఆర్నన్ను సన్నాసి అంటున్నడు.. నాకేం తెల్వదట. ఇదిగో కేసీఆర్.. ఎన్నికల కమిషన్ కు నువ్వు ఇచ్చిన అఫిడవిట్ ఇది. నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని (53 ఎకరాల 30 గుంటల భూమి మాత్రమే ఉంది. కానీ ధరణి రికార్డుల్లో మాత్రం 53 ఎకరాల 31 గుంటల భూమి ఉన్నట్లు చూపుతుంది) ఎక్కువగా చూపింది. నీదో దిక్కుమాలిన ప్రభుత్వమని నీకు అనిపిస్తలేదా..? ఇట్ల తెలంగాణ రైతుల భూముల ఎవరెవరి రికార్డులు తారుమార్జేసినవ్. ధరణి పేరుతో ఎందరి జీవితాలతో ఆడుకుంటున్నవ్ కేసీఆర్’ అని తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.
సీఎం పదవి రేసులో కేటీఆర్, హరీశ్, కవిత
బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రకు తెరతీసిండు. పొరపాటున బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... కొద్ది నెలల్లోనే ఉప ఎన్నికలు వస్తయ్. సీఎం పదవి రేసులో కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు ఉన్నరు. అప్పుడు ప్రభుత్వం కూలిపోవడం పక్కా... అట్లాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి కోసం అందరూ కొట్లాడుకుంటరు. తెలంగాణలో సుస్థిర పాలన కావాలంటే అది బీజేపీకే సాధ్యం.
ఃఅయితే అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతానని చెప్పను. అది నాకు అలవాటు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుంది. అంతే తప్ప నేను సీఎం అవుతానని ఎన్నడూ చెప్పను. అయితే బీజేపీ గెలిస్తే బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు’ అని స్పష్టంచేశారు.