కరీంనగర్ : తన లైన్ పేదలు... హిందుత్వమే అని చెప్పారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాడుతూనే ఉంటానన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సజీవంగా ఉన్నాయన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రాకపోతే తమ కార్యకర్తలను బతకనీయరని చెప్పారు. కరీంనగర్ రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్ లో బీజేపీ సోషల్ మీడియా టీమ్ తో ఎంపీ బండి సంజయ్ సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గురించి చర్చే లేదన్నారు. బీజేపీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ గ్రాఫ్ పెంచే కుట్ర జరుగుతోందన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేసి.. బీజేపీ పార్టీని దెబ్బతీసే కుట్ర చేశారని చెప్పారు. తన నిజాయితీ, నిబద్దతను కాపాడుతోంది సోషల్ మీడియానే అన్నారు.
కేసీఆర్ గుప్పిట్లో మీడియా సంస్థలు ఉన్నాయన్నారు బండి సంజయ్. రాబోయే ఎన్నికల్లో బీజేపీ వార్తలు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా జనంలోకి వెళ్లాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కోరారు.