నిజామాబాద్, వెలుగు: ప్రధాని మోదీ ఇచ్చిన పసుపు బోర్డు హామీ నెరవేరిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బోర్డుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారతాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం కమలం పార్టీ విధానమన్నారు. గురువారం ఆయన నగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. పసుపు బోర్డుతో రైతులకు మేలు జరుగుతుందని ప్రాసెసింగ్ యూనిట్లతో యువతకు ఉద్యోగాలు దొరుకుతాయన్నారు.
ఎమ్మెల్యే జీతం పేద విద్యార్థులకు..
ఎమ్మెల్యేగా గెలిచాక తనకు వచ్చే జీతం మొత్తాన్ని పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తానని బీజేపీ అర్బన్ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ సభలో ప్రకటించారు. తనకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదన్నారు. 24 ఏండ్ల నుంచి ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. సంపాదన కోసం పాలిటిక్స్‌లోకి రాలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్ర్రైనేజీ అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి గణేశ్‌గుప్తా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. మినీ ట్యాంక్ బండ్ కోసం రూ.4 కోట్లు ఖర్చు చేసి రూ.20 కోట్లు మింగారన్నారు. ఫేక్ పేపర్లు సృష్టించి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, కమీషన్ తీసుకోకుండా ఏ పని జరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీన్ని మార్చేందుకే తాను పోటీ చేస్తునాన్నారు.
కమీషన్ల కోసమే మంచిప్ప, మాసాని
లక్ష ఎకరాలకు సాగునీరంచే లక్ష్యంగా మాసాని ట్యాంక్, మంచిప్ప రిజర్వాయిర్ నిర్మిస్తున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పడం ఆపాలని రూరల్ బీజేపీ అభ్యర్థి దినేశ్కులాచారి పేర్కొన్నారు. పంట సాగుకు ఉపయోగపడని ఈ నిర్మాణాలను కమీషన్ల కోసమే నిర్మిస్తున్నారన్నారు. శనివారం తాను మంచిప్ప గండి మైసమ్మ గుడికి వస్తానని, రిజర్వాయర్ నిర్మాణంలో అవినీతి జరగలేదని బాజిరెడ్డి నిరూపించాలని సవాల్ చేశారు.