ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, మోసపూరిత హామీలతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ తీరును ఎండగట్టాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. శనివారం బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుల వర్చువల్ మీటింగ్‌లో ఆయన క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గ పాలక్ లు, లీడర్లు హాజరయ్యారు. ఆయా మీటింగ్‌లలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పాలక్ వన్నాల శ్రీరాములు, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బి.ప్రవీణ్ రావు, సిరిసిల్ల నుంచి రాణీ రుద్రమ, జిల్లా ఇన్చార్జ్ గంగాడి మోహన్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఇన్చార్జి మీసాల చంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారి ఆరుమూళ్ల పోచం, మంథని నుంచి సునీల్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, లీడర్లు పాల్గొన్నారు. - వెలుగు, నెట్వర్క్
భూ సమస్యలకు సత్వర పరిష్కారం; కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల,వెలుగు : రెవెన్యూ, భూ సమస్యలు తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన అర్జీదారుల నుంచి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో 52 దరఖాస్తులు స్వీకరించామన్నారు. 16 దరఖాస్తులను అప్పటికప్పుడే ఆన్ లైన్ లో అప్రూవ్ చేసి పరిష్కరించామన్నారు. అనంతరం నారాయణపూర్ లో కంపోస్ట్ షెడ్, ప్రైమరీ స్కూల్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, ఎంఆర్వో జయంత్, సర్పంచ్ లక్ష్మి ఉన్నారు.వేములవాడ రూరల్ : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వేములవాడ ఆర్డీఓ పవన్‌కుమార్ అన్నారు. మండలంలోని చెక్కపల్లిలో శనివారం భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సమస్యలు ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కలెక్టరేట్ డీ విభాగం సూపరింటెండెంట్ రాంరెడ్డి, సర్పంచ్ జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోన్ తీసుకోకున్నా బకాయిలు కట్టమంటున్రు
యూనియన్ బ్యాంక్ ముందు మహిళల నిరసన
మెట్ పల్లి, వెలుగు: తాము బ్యాంకులో రుణం తీసుకోకపోయినా బాకీ డబ్బులు కట్టాలని యూనియన్ బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మెట్ పల్లి మండలం కోనరావుపేటకు చెందిన 15 మంది మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం బ్యాంక్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనరావుపేటకు చెందిన 15 మంది మహిళలు సరస్వతి మహిళా సంఘం పేరిట గ్రూపు ఏర్పాటు చేసుకుని, రుణం తీసుకున్నామన్నారు. 2020లో బ్యాంకు బాకీ మొత్తం కట్టి గ్రూప్ క్లోజ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత బ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదని అయినా మెట్ పల్లి యూనియన్ బ్యాంకు అధికారులు సరస్వతి మహిళా సంఘం బ్యాంకుకు బాకీ ఉన్నారని వడ్డీతో సహా రూ.96 వేలు కట్టాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. శనివారం బ్యాంకు మేనేజర్ ను అడగగా 2020లో రూ.5 లక్షలు రుణం తీసుకున్నట్లు, నాలుగున్నర లక్షలు కట్టినట్లు, మిగతా రూ.50 వేలు కట్టలేదని చెప్పారన్నారు. తాము రుణం తీసుకోనపుడు సంఘం అకౌంట్ లో డబ్బులు ఎలా జమ చేస్తారని బాధితులు మేనేజర్ ను ప్రశ్నించారు. స్పందించిన మేనేజర్ తాను కొత్తగా విధుల్లో చేరానని రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తానని తెలిపారు. నిరసన తెలిపినవారిలో మహిళా సంఘం సభ్యులు లక్ష్మి, రాధ, సరోజన, ప్రమీల, సాయమ్మ, అంజమ్మ, పద్మ, నీలమ్మ, బాజమ్మ, ఏ లక్ష్మి, ఎన్ సాయమ్మ తదితరులు ఉన్నారు.