ఈనెల 31న మునుగోడుకు నడ్డా

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మునుగోడు టూర్ ఖరారైంది. ఈ నెల 31 న మునుగోడులో ఏర్పాటు చేయనున్న ఉప ఎన్నిక ప్రచార సభకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఈ నెల 30 న సీఎం కేసీఆర్ సభ, మరుసటి రోజే నడ్డా సభ జరగనుంది.

ప్రచార సభలో పాల్గొననున్న బీజేపీ ప్రెసిడెంట్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మునుగోడు టూర్ ఖరారైంది. ఈ నెల 31 న మునుగోడులో ఏర్పాటు చేయనున్న ఉప ఎన్నిక ప్రచార సభకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఈ నెల 30 న సీఎం కేసీఆర్ సభ ఉండడం, మరుసటి రోజే నడ్డా సభ జరగనుండడంతో మునుగోడు బైపోల్ ప్రచార ముగింపు రసవత్తరంగా మారనుంది. వచ్చే నెల 1తో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు గ్రాండ్ గా ముగింపు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి.​ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రచారానికి  మరింత ఊపు తీసుకురావాలని బీజేపీ భావిస్తుండగా.. ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ఆయనకు బదులు నడ్డాను టూర్​కు ఎంపిక చేశారు.

నడ్డా మునుగోడు ప్రచార సభను ఖరారుచేస్తూ శనివారం సాయంత్రం బీజేపీ  కేంద్ర కార్యాలయం నుంచి స్టేట్ ఆఫీసుకు సమాచారం అందింది. దీంతో ఆయన సభను విజయవంతం చేయడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఈ సభకు ఒకరోజు ముందే సీఎం కేసీఆర్ సభ ఉండడంతో టీఆర్ఎస్ సభ కన్నా బీజేపీ సభకు ఎక్కువ జనాన్ని తరలించి ప్రచారం పర్వంలో కూడా కాషాయ దళానిదే  పైచేయి అనే సంకేతాలను జనలోకి తీసుకెళ్లే ఆలోచనతో బీజేపీ ఉంది. మూడు రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్​లో  నడ్డాకు సమాధి కట్టడం, బీజేపీకి చెందిన ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ తిరిగి చేర్చుకోవడంతో సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న బీజేపీ హైకమాండ్.. నడ్డా సభతో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.